ప్రకృతి పచ్చగా ఉంటేనే.. ప్రపంచం కళకళలాడుతుంది. జనం సంతోషంగా ఉంటారు. తరచూ థియేటర్లకు వెళ్తారు. అభిమాన తారల చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఎంత సెలెబ్రిటీలైనా కథా నాయికలూ సంఘజీవులే. భూగోళానికి ముంచుకొస్తున్న ముప్పులు వారినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.

ప్రకృతి పచ్చగా ఉంటేనే.. ప్రపంచం కళకళలాడుతుంది. జనం సంతోషంగా ఉంటారు. తరచూ థియేటర్లకు వెళ్తారు. అభిమాన తారల చిత్రాలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. ఎంత సెలెబ్రిటీలైనా కథా నాయికలూ సంఘజీవులే. భూగోళానికి ముంచుకొస్తున్న ముప్పులు వారినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందుకే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.
అనుష్క శర్మ
అనేకానేక పర్యావరణ కార్యక్రమాలకు, ఉద్యమాలకు సామాజిక మాధ్యమాన్ని వేదికగా ఎంచుకున్నారు అనుష్క శర్మ.అమెజాన్ అడవుల్లో దావానలం గురించి, ఆ విపరిణామాల ప్రభావం గురించి తీవ్రస్థాయిలో గళమెత్తారు. హాలీవుడ్ స్టార్స్ ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ‘ఇలాంటి విషయాలను మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు’ అంటారామె ఉద్వేగంగా. మహా వేగంగా మంచుకొండలు కరిగిపోతున్న తీరును గుర్తుచేస్తారామె. దీనివల్ల భవిష్యత్తులో జలప్రళయం సంభవించే ఆస్కారం ఉందని ప్రభుత్వాలను హెచ్చరిస్తారు కూడా. ఔషధాల కోసం, అలంకరణ వస్తువుల కోసం అరుదైన జీవజాతులను మనిషి మింగేస్తున్న తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. అనుష్క నేతృత్వంలోని ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ.. స్పాట్స్‌లో తడి, పొడి చెత్తలను వేరు చేయడానికి ఓ బృందాన్ని నియమించింది.
ఆలియాభట్
ఆలియా స్వతహాగా ప్రకృతి ప్రేమికురాలు. పచ్చదనాన్ని చూస్తే చాలు పరవశించిపోతారు. షూటింగ్ స్పాట్‌లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను నిషేధిస్తేనే కాల్‌షీట్స్ ఇస్తానని నిర్మాతలకు తెగేసి చెబుతారు. ప్లాస్టిక్ భూతం భూగోళాన్ని మింగేస్తుందని హెచ్చరిస్తూ.. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఉద్యమ ప్రచారంలో తన గొంతు వినిపించారు. మనుషులు-జంతువుల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ ‘కో ఎగ్జిస్ట్’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ‘సమాజంలో మనుషులకే కాదు.. జంతువులకూ హక్కులు ఉన్నాయి’ అంటారామె. వీధి కుక్కల దత్తత కోసమూ ఓ ఉద్యమం చేపట్టారు. వాటికి వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నారు.
ఐశ్వర్యరాయ్ బచ్చన్
నాలుగేండ్ల క్రితమే ఐశ్వర్య ‘యాంబీ’ అనే ఎన్విరాన్‌మెంటల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. వ్యాపారం కూడా ఓ సామాజిక బాధ్యతే అని నమ్ముతారామె. మారుమూల పల్లెలో సైతం గాలి నాణ్యతను గుర్తించి హెచ్చరించడం ఈ అంకుర సంస్థ ప్రత్యేకత. మహారాష్ట్రలోని పవన విద్యుత్ సంస్థలోనూ తనకు వాటాలు ఉన్నాయి. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఫర్ యానిమల్స్ (పెటా)తో ఐశ్వర్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐక్యరాజ్య సమితి వేదికగా తన గళాన్ని వినిపించారు ఈ బచ్చన్ గారి కోడలు.
దీపిక పదుకోన్
పదమూడేండ్ల క్రితమే మహారాష్ట్రలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ పల్లెను పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. సౌరశక్తి ద్వారా ఇంటింటికీ విద్యుత్ అందిస్తున్నారు. ‘బ్లూ స్మార్ట్’ అనే ఎలక్ట్రిక్ టాక్సీ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. తమ వివాహ రిసెప్షన్ పర్యావణానికి మంచి జరిగే పద్ధతిలోనే నిర్వహించేలా భర్త రణబీర్‌ను ఒప్పించారు. చెరుకు పిప్పి నుంచి తయారుచేసిన వస్తువులనే ఉపయోగించారు. ‘చుక్’ అనే ఎకో ఫ్రెండ్లీ టేబుల్‌వేర్ తయారీ సంస్థకు అన్ని విధాలుగా సహకరించి కొత్త జీవం పోశారు.